Sunday, March 27, 2011

బాపు బొమ్మల కొలువు, జూన్ 2011

Monday, November 15, 2010

http://www.bapuartcollection.com/shop/

బాపు అభిమానులకు ఒక శుభవార్త. బాపు గారి కోరిక మేరకు నా మిత్రుడు రవి శంకర్ ఒక web site నిర్మించాడు. ఇకపైన బాపు గారి బొమ్మలన్నీ ఈ site ద్వారా కొనుక్కోవచ్చు. బాపు గారి బొమ్మలను బాపు గారి అనుమతి లేకుండా పలువురు అమ్ముతున్నారని, బాపు గారే ఈ web site ద్వారా బొమ్మలను అందుబాట్లోకి తెస్తున్నారు. ఈ web site గురించి బాపు గారి మాటల్లోనే వినవచ్చు (videoలో చూడవచ్చు). ఈ విషయం మీ మిత్రులందరికీ తెలియపరచండి. అనధికారిక అమ్మకాలను నిలువరించటంలో తోడ్పడండి.

Saturday, January 30, 2010

గుమ్మడి గారి జ్ఞాపకం
బాపు గారి సినీప్రస్థానం project కి ప్రేరణ గుమ్మడి గారే. అవును.

2004లో అనుకుంటా గుమ్మడి గారి "తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకం విశాలాంధ్రలో తీసుకుని చదివాను. ఆ పుస్తకంలో 67-68 పేజీల్లో వారు బాపు రమణల గురించి వ్రాసిన వాక్యాలు నన్ను ఆకర్షించాయి. 68పేజిలో ".... షూటింగ్ స్క్రిప్టులు యథాతథంగా అచ్చు వేయిస్తే అవి వర్థమాన దర్శకులకు బాలశిక్షలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం." అని చదివి అవి ఎవరైనా ప్రచురిస్తే ఎంత బాగుంటుందో అని ఆశపడ్డాను. తర్వాత "స్మైల్" పత్రికలో ప్రచురించిన "శ్రీనాథ కవిసార్వభౌమ" సినిమా script కోసం బాపు గారు వేసుకున్న story board బొమ్మ ఒకటి చూసిన నాకు ఆ స్క్రిప్ట్లులు చూడాలన్న కోరిక మరింత బలపడింది. కొన్నాళ్ళకు ఆ పని మనమే ఎందుకు చేయకూడదు ఎవరో చేస్తారని ఎందుకు అనుకోవాలని నా మిత్రులతో చెప్పాను. వారికి నచ్చింది. మేము నలుగురము తలా ఇరవై వేలు వేసుకొని మొదలు పెట్టాము. అలా 2005లో మొదలైంది మా project. ఐతే చాలా రోజుల వరకు గుమ్మడి గారిని కలవలేకపోయాము.

బాపు గారి సుందరకాండ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో గుమ్మడి గారిని కలిసాను. ఫోనులో అప్పాయింట్మెంట్ తీసుకొని ఒక ఆదివారం (7 అక్టోబరు 2007) ఉదయం వెళ్ళి కలిసాను. బాపు గారితో వారు కొన్ని సిన్మాలు చేసివున్నందున ఆ విశేషాలు చెబితే మేము చేసే project కోసం record చేసుకుంటాను అని వారికి చెప్పాను. ఆరోగ్యం అంత బాగా లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను అన్నారు. ఎంత చెప్పినా చాలు అని చిరునామా "తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకంలో వున్నదేనా అని confirm చేసుకొని వెళ్ళాను. దాదాపు 40 నిమిషాలు వారితో గడిపాను. తర్వాత వారు అలిసిపోయారు. పడుకోవాలని అన్నారు. ఇంకా ఏమి చేప్పేది లేదు, ఎక్కువ మాట్లాడలేను అని అన్నారు. వారి ఇబ్బంది గమనించి recording ముగించి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నా దగ్గర వున్న"తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకంపైన వారి autograph తీసుకున్నాను. గుమ్మడి గారు పుస్తకంలో (పేజి 68) పేర్కొన్న బొమ్మ హాల్లో గోడకు వేళ్ళాడుతూ కనిపించింది (ఇదే బొమ్మా పుస్తకంలో 172 పేజిలో వున్న ఫోటోలో చూడొచ్చు). వారి అనుమతి తీసుకొని ఆ చిత్రం photo మరియు వీడియో తీసుకున్నాను.


ఇన్నాళ్ళకు వారి మరణ వార్త చదివిన నాకు నిజంగా బాధేసింది. ఐతే వారితో గడిపిన 40 నిమిషాలు నాకు తీపి గురుతులుగా మిగిలాయి. వారి వీడియో,వారింట్లో వున్న బాపు గారి బొమ్మ పైన చూడొచ్చు. వారితో తీసుకున్న ఫోటో ఇక్కడ చూడొచ్చు.

Monday, December 14, 2009

బాపు గారి 76వ పుట్టినరోజు

సాక్షి నామ సంవత్సరంలో జన్మించిన దర్శకుడికి 76 సంవత్సరాలు నిండుతాయి ఈ 15 డిసెంబరు రోజు. ఆ బామ్మల బ్రహ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామని వెళ్ళాము. 15 నాడైతే బాపు గారు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినవారితో busyగా వుండి వారితో గడపడానికి మాకు సమయం దొరకదని 2 రోజులు ముందే అంటే 13 డిసెంబరు (ఆదివారం) చెన్నైలోని బాపు గారింటికి వెళ్ళాము. వారి ఇంట్లో వారంతా మమ్మల్ని వాళ్ళింట్లో వాళ్ళలాగా చూసుకున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 (మధ్యలో ఒక 2 గంటలు రమణగారితో మాట్లాడే భాగ్యం కలిగింది) దాకా మాట్లాడే సువర్ణావకాశం దొరికింది. బొమ్మల గురించి, సిన్మాల గురించి చాలా మాట్లాడుకున్నాము (ఆ వివరాలు తర్వాత వివరంగా వ్రాస్తాను). మేమెంతగా enjoy చేసామో చెప్పలేము. మా ఆనందం పరవశం చూసి అనుకుంటా, మధ్యాహ్నం కాసేపు నిద్రపోయే అలవాటు వున్న బాపు గారు, మాతో అలాగే కూచున్నారు. వారి కొత్త బొమ్మలు చూపించారు. వాటి వెనకున్న కథాకమామిషూ చెప్పారు. వారి collectionలో వున్న కొన్ని బొమ్మల పుస్తకాలు చూపించి వాటి గొప్పతనం చెప్పారు. మేము తిరిగి వస్తున్నపుడు , You made my day అన్నారు. అసలు మేము అనాలనుకున్న మాట వారన్నారు. ఆ జ్ఞాపకాలతో మురిసిపోతూ తిరుగు ప్రయాణమయ్యాము.

Sunday, November 15, 2009

బాపు గారు ఎంపిక చేసిన "చిన్న కథకు నిర్వచనాలనతగ్గ 11 మంచి కథలు"

పుస్తకం వెనక అట్ట1960 నవంబరులో శేషాచలం & కం. వారు "కథ 1" అని ఒక పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకంలో ప్రచురింపబడ్డ కథలు ఎంపిక చేసి బొమ్మలు వేసింది బాపు గారే.

Friday, November 13, 2009

సచిత్ర సృష్టికర్తకు 75 వసంతాలు

నవతరంగంలో ప్రచురింపబడ్డ వ్యాసం |ప్రచురణ: December 15, 2008 at 5:59 pm

(నాగార్జున సిమెంట్స్ వారి తోటలో, సుందరకాండ షూటింగ్ సమయంలో వంశీ, బాపు, బివియస్ రామారావు గార్లు)

4 ఆగస్టు, 2007.

సామ గార్డెన్స్ (హైదరాబాదు) లో “సుందరకాండ” సినిమా షూటింగ్ .

“ఆకూ వక్కా తాంబూలం…” పాట. సాయంత్రం నాలుగు కావొస్తోంది.

డైరెక్టరు అనుకున్న షాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఆరింటికి pack up చెప్పాలి. లైటు తగ్గుతోంది. కెమెరా మెన్ రాజు గారు లైటింగు సరి చేస్తున్నారు. లైట్ బాయ్స్ లైట్లు సర్దుతుతూ పరుగులు తీస్తున్నారు. అంతేమరి షూటింగు లో ప్రతి నిమిషము విలువైనది. డైరెక్టరు గారు స్క్రిప్ట్ చూసుకుంటున్నారు. ఈ షాటు తర్వాతి షాటు, దాని తర్వాతి షాటు ప్లాన్ చేసుకుంటున్నారు. అసిస్టెంట్ వచ్చి water కావాలా సార్ అని అడిగాడు. ఇప్పుడు disturb చేయకు ఆన్నారు డైరెక్టర్. ఇంతలో ఓ పదేళ్ళ పిల్లాడు తుర్రున వచ్చి చెయి ఇస్తూ (షేక్ హ్యాండ్) “సాయిచంద్” అన్నాడు. డైరెక్టరు గారు ఓపిగ్గా “ఏంటమ్మా?” అన్నారు చేయి ఇస్తూ.
“సాయిచంద్”.
“ఆహా ..” (చిరు నవ్వుతో)
“మీ పేరు?”
“నా పేరు లక్ష్మినారాయణ”
ఆ పిల్లాడు తన చెయ్యి లాక్కుని తుర్రున వెళ్ళిపోయాడు.

ఆ లక్ష్మినారాయణే మన బాపు గారు. నా అదృష్టం ఏంటంటే “సుందరాకాండ” షూటింగ్ మొత్తం చూసే అవకాశం దోరికింది. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను. బాపు గారు లేని తెలుగు సినీ మరియు సాహితి చరిత్ర వుండదు. ఆ బాపు గారికి ఈ రోజు (15 డిసెంబరు)కి డెబ్బైఅయిదు వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా “సుందరాకాండ” షూటింగ్ అనుభవాలు కొన్ని ఇక్కడ పంచుకుంటాను.

సుందరాకాండ సినిమా (అప్పటికి ఆ పేరు అనుకోలేదు) షూటింగ్ గురించి తెలియగానే బాపు గారికి ఫోన్ చెసి మీ షూటింగ్ చూడాలని చాలా ఆశగా వుంది నేను షూటింగ్ కి రావొచ్చా అని request చేసా. ఓ తప్పకుండా, కో-డైరెక్టరు శ్రీనివాసు గారికి చెబుతాను అన్నారు. అంతే ఢాం అని పేద్ద శబ్దం. ఎగిరి గంతేసాను కదా పక్కన వున్న కుర్చి కింద పడిందన్న మాట. వెంటనే ఆఫిస్ లో 40 రోజుల లీవు అడిగాను. ప్రైవేట్ కంపెనీల్లొ అన్ని రొజుల లీవు అంటే అంత సులభం కాదు. కాని, అన్నీ మంచి శకునములే అన్నట్టు లీవు మంజూరయ్యింది.

షూటింగ్ కి అయితే వెళ్ళాను కాని, బాపు గారికి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో తీయాలని చాల మటుకు సైడ్ పోజ్ లలో లేకపోతే బాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. గమనించట్లేదు అనిపించినపుడు ముందు నుంచి కూడా తీసాను. కోన్ని రోజులు (ఓ పది రోజులు అనుకుంట) తర్వాత, బాపు గారు ఒకసారి మీరు తీస్తున్న వీడియో చూపించండి అన్నారు. మంచి ఇంప్రెషన్ కొట్టేద్దామని కొంచం vibrant కలర్స్ తో షూటింగ్ అయిన సీన్ల కేసెట్ వేసి చూపించా. కొంచెం సేపు చూసి, వీడియో ముందు నుంచి తీయండి, actors కి చెపుతున్నపుడు కూడా తీయండి అన్నారు. మీకు డిస్టర్బెన్స్ గా వుంటుందేమోనని అని నేను అంటుంటే, ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పారు.

“అనుకోకుండా ఒక రోజు”లో ఛార్మి నటన చూసి బాపుగారు మెచ్చుకొని ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నారని మనకు తెలిసిందే. ఛార్మి కూడా బాపు గారితో సినిమా చేయడము చాలా అదృష్టంగా భావించి షూటింగ్ కి హాజరైన ప్రతి రోజు బాపు గారి ప్రక్కన కుర్చి వేయించుకొని కూర్చునేది. వాళ్ళిద్దరి మాటలు సరదాగా సాగేవి. ఒకసారి షూటింగ లో దోమలు కుడుతుంటే “ఎన్ని దోమలో” అని ఛార్మి వాపోతుంటే, “మగ దోమలు అయ్యుంటాయి” అని చమత్కరించారు. (ఇంకా చాలా వున్నాయి.)

ఈ సినిమా షూటింగ్, రీ-రికార్డింగ్, ఎడిటింగ్ ఇలా అన్ని కవర్ చేసే అవకాశం లభించింది (౩౦ గంటలకు పైగా వీడియో). ఆ వీడియో నుంచి ఒక 30 నిమిషాల నిడివితో “సుందరకాండ నిర్మాణం” (Making of Sundarakanda) చేసాను (ఈ పేజీలో కుడిప్రక్కన "సుందరకాండ నిర్మాణం" వీడియోలు చూడొచ్చు).

ఈ వీడియో చిత్రీకరణ కు రమణ గారు కూడాఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. (వీడియో మొదటి భాగం లో రమణ గారు స్క్రిప్ట్ వ్రాయటం వుంది). అన్నట్టు బాపు మంచి నటుడు కూడా. Actor బాపు ని చూడాలనుకుంటే, మూడో భాగం వీడియో చూడండి. ఆ యాక్టర్, డైరెక్టర్, ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ బాపు గారికి మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.

Tuesday, November 10, 2009

నవంబర్ 1న చెన్నైలో జరిగిన బాపు గారి చిత్ర ప్రదర్శన