Saturday, January 30, 2010

గుమ్మడి గారి జ్ఞాపకం




బాపు గారి సినీప్రస్థానం project కి ప్రేరణ గుమ్మడి గారే. అవును.

2004లో అనుకుంటా గుమ్మడి గారి "తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకం విశాలాంధ్రలో తీసుకుని చదివాను. ఆ పుస్తకంలో 67-68 పేజీల్లో వారు బాపు రమణల గురించి వ్రాసిన వాక్యాలు నన్ను ఆకర్షించాయి. 68పేజిలో ".... షూటింగ్ స్క్రిప్టులు యథాతథంగా అచ్చు వేయిస్తే అవి వర్థమాన దర్శకులకు బాలశిక్షలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం." అని చదివి అవి ఎవరైనా ప్రచురిస్తే ఎంత బాగుంటుందో అని ఆశపడ్డాను. తర్వాత "స్మైల్" పత్రికలో ప్రచురించిన "శ్రీనాథ కవిసార్వభౌమ" సినిమా script కోసం బాపు గారు వేసుకున్న story board బొమ్మ ఒకటి చూసిన నాకు ఆ స్క్రిప్ట్లులు చూడాలన్న కోరిక మరింత బలపడింది. కొన్నాళ్ళకు ఆ పని మనమే ఎందుకు చేయకూడదు ఎవరో చేస్తారని ఎందుకు అనుకోవాలని నా మిత్రులతో చెప్పాను. వారికి నచ్చింది. మేము నలుగురము తలా ఇరవై వేలు వేసుకొని మొదలు పెట్టాము. అలా 2005లో మొదలైంది మా project. ఐతే చాలా రోజుల వరకు గుమ్మడి గారిని కలవలేకపోయాము.

బాపు గారి సుందరకాండ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో గుమ్మడి గారిని కలిసాను. ఫోనులో అప్పాయింట్మెంట్ తీసుకొని ఒక ఆదివారం (7 అక్టోబరు 2007) ఉదయం వెళ్ళి కలిసాను. బాపు గారితో వారు కొన్ని సిన్మాలు చేసివున్నందున ఆ విశేషాలు చెబితే మేము చేసే project కోసం record చేసుకుంటాను అని వారికి చెప్పాను. ఆరోగ్యం అంత బాగా లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను అన్నారు. ఎంత చెప్పినా చాలు అని చిరునామా "తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకంలో వున్నదేనా అని confirm చేసుకొని వెళ్ళాను. దాదాపు 40 నిమిషాలు వారితో గడిపాను. తర్వాత వారు అలిసిపోయారు. పడుకోవాలని అన్నారు. ఇంకా ఏమి చేప్పేది లేదు, ఎక్కువ మాట్లాడలేను అని అన్నారు. వారి ఇబ్బంది గమనించి recording ముగించి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నా దగ్గర వున్న"తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకంపైన వారి autograph తీసుకున్నాను. గుమ్మడి గారు పుస్తకంలో (పేజి 68) పేర్కొన్న బొమ్మ హాల్లో గోడకు వేళ్ళాడుతూ కనిపించింది (ఇదే బొమ్మా పుస్తకంలో 172 పేజిలో వున్న ఫోటోలో చూడొచ్చు). వారి అనుమతి తీసుకొని ఆ చిత్రం photo మరియు వీడియో తీసుకున్నాను.


ఇన్నాళ్ళకు వారి మరణ వార్త చదివిన నాకు నిజంగా బాధేసింది. ఐతే వారితో గడిపిన 40 నిమిషాలు నాకు తీపి గురుతులుగా మిగిలాయి. వారి వీడియో,వారింట్లో వున్న బాపు గారి బొమ్మ పైన చూడొచ్చు. వారితో తీసుకున్న ఫోటో ఇక్కడ చూడొచ్చు.

7 comments:

kaartoon.wordpress.com said...

గుమ్మడి ఇకలేరన్న వార్త చెప్పలేని మనొవ్యధని కలిగించింది.
మిరు గుమ్మడి గారి తో చేసిన ఇంటర్వూ వీడియో, బాపు
గారు గీసిన బాపూనెహృ చిత్రం చూసే అవకాశం మాకు
కలిగించినందుకు ధన్యవాదాలు.

SRRao said...

విజయ్ గారూ !
గుమ్మడి గారికి మీరందించిన చిత్ర నీరాజనానికి ధన్యవాదాలు.

antaryagam said...

మాయా బజార్ గురించి గుమ్మడి గారి పర్సనల్ భావాలు వినటం ఎంతో బాగుంది.

ఇంతకు ముందు ఒక సారి టీవీ ఇంతర్వ్యూ లో మాట్లాడుతూ గుమ్మడి గారు ఇప్పుడు టీవీ ద్వారా అసభ్యత, అస్లీలత మన నట్టింట్లో వచ్చి కూర్చుంది, అది వరకు లాగ మనకి మన పిల్లలని అసభ్యత కి దూరంగా ఉంచే అవకాశం లేదు అని ఆవేదన వ్యక్త పరిచారు.

అది మీతో పంచుకుందామని అనిపించింది.

Lakshmi said...

chaala santhosham....maa nannagari gurinchi vrasinandhuku.

కనకాంబరం said...

గుమ్మడి గారి గ్నాపకాలు కళ్ళకు కట్టినట్లు చక్కగా వివరించారు.ఆధునిక సమాజానికి చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖమైన అంగంగా మారిపోయింది.ఆరంగంలోని,ప్రముఖులజీవిత విశేషాలనే కాక,.......
ఆ రంగంలో నిరంతరం శ్రమించి తాడితులై, పీడితులైన వారి గురించి,ప్రేక్షక ప్రపంచానికి పరిచయమే కాక సినీ రంగ ఆకర్షణలో వచ్చి తాకి శలభాల్లా కనలిన జీవితాల నిమ్నోర్ధ్వాలను విశ్లేషించే ప్రయత్నం చేయండి. ఇంతకీ ఈ రంగం పై మీకు ఆసక్తి ఎలా యేర్పడింది? అభినందనలతో .. శ్రేయోభిలాషి...

విజయవర్ధన్ (Vijayavardhan) said...

కనకాంబరం గారు,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నాకు బొమ్మలు (కదిలేవి, కదలనివి) అంటే ఇష్టం. వాటి సృష్టి గురించి తెలుసుకోవటం ఇష్టం. ఎప్పటికైనా ఆ సృష్టిలో భాగం అవ్వాలని ఆశ.

వేణు said...

విజయవర్థన్ గారూ! గాంధీ, నెహ్రూలను రేఖాచిత్రంలో అద్భుతంగా చిత్రించిన బాపూ బొమ్మ చాలా బావుంది!